
న్యూఢిల్లీ, నవంబర్ 6: ఢిల్లీ జ్యుడీషియల్ సర్వీస్ ఎగ్జామినేషన్-2023కు దరఖాస్తులు కోరుతూ ఢిల్లీ హైకోర్టు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 53 పోస్టులను ఈ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో సూచించిన విద్యార్హతలతోపాటు న్యాయవాద వృత్తి ప్రాక్టీస్ చేసిన వారై ఉండాలి. దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 32 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్ ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.1500 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. ఆన్‌లైన్ దరఖాస్తులు నవంబర్ 07, 2023వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. నవంబర్ 22, 2023వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఆధారంగా (ప్రిలిమ్స్, మెయిన్స్) ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష డిసెంబర్ 10, 2023వ తేదీన నిర్వహిస్తారు. ఇతర పూర్తి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
తెలంగాణ ‘పది’ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు.. షెడ్యూల్ ఇదే
తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు సోమవారం (నవంబర్ 6) నుంచి ప్రత్యేక తరగతుల ప్రారంభమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలతోపాటు మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, జనరల్ గురుకులాల్లోనూ ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు అంటే గంటపాటు రోజుకో సబ్జెక్టును చదివిస్తారు. రోజూ ఆ సబ్జెక్టు ఉపాధ్యాయుడే హాజరై విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ, విద్యార్ధులతో సాధన చేయిస్తారు. ఇందుకు సంబంధించిన టైం టేబుల్‌ను విద్యాశాఖ ఆయా పాఠశాలలకు జారీ చేసింది. 2024 పబ్లిక్ పరీక్షలకు గానూ పదో తరగతి విద్యార్ధులను సిద్ధం చేయిస్తున్నారు. ఇక జనవరి నుంచి వార్షిక పరీక్షల వరకు సాయంత్రం బడి వేళలు ముగిసిన తర్వాత మరో గంట ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే సీఎం అల్పాహారం పథకం అమలవుతున్న పాఠశాలల్లో ప్రత్యేక తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు ఆకలి సమస్య లేనప్పటికీ మిగిలిన చోట్ల ఎలా అనే విషయం ప్రశ్నార్ధకంగా మారింది.
తెలంగాణ ఎంఈడీ, ఎంపీఈడీ ప్రవేశాలు ప్రారంభం
తెలంగాణలో ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో తొలి విడత ప్రవేశాలతో పాటు ఉమ్మడి పీజీ ప్రవేశాల పరీక్ష (సీపీగెట్) చివరి విడత కౌన్సెలింగ్ ఆదివారం (నవంబర్ 5) నుంచి ప్రారంభం అయ్యింది. ఇప్పటివరకు రెండు విడతల కౌన్సెలింగ్ ముగియగా, చివరి విడతలో ఎంఈడీ, ఎంపీఈడీ కోర్సుల్లో సీట్ల భర్తీని చేపట్టనున్నారు. నవంబరు 5 నుంచి 8వ తేదీ వరకు సీపీగెట్‌లో ఉత్తీర్ణులైన వారు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. నవంబర్ 9 నుంచి 11 వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి. నవంబర్ 15న సీట్ల కేటాయింపు జరుగుతుందని సీపీగెట్ కన్వీనర్ ఆచార్య ఐ పాండురంగారెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.
No comments:
Post a Comment